తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం
హైదరాబాద్: తెలంగాణ రాదేమోననే ఆందోళనతో మరో యువకుడు ఆత్మబలిదానానికి ఒడిగట్టాడు. తెలంగాణ నిర్ణయంలో జరుగుతున్న జాప్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్రులు చేస్తున్న ప్రయత్నాలతో ఆందోళనకు గురై హైదరాబాదులోని రసూల్‌పురాకు చెందిన ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణకాంత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు.
తెలంగాణ రాకుండా సీమాంధ్రులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లేఖ రాసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 18 ఏళ్ల కృష్ణకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి తండ్రి ధనంజయ్, తల్లి హేమలత, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. పెద్ద తమ్ముడు చంద్రకాంత్ పదో తరగతి, చిన్న తమ్ముడు రవికాంత్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కృష్ణకాంత్ మృతదేహానికి తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ నివాళులు అర్పించారు.

రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యల పర్వం మొదలైంది. గురువారంనాడు తెలంగాణలో మూడు మరణాలు సంభవించాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్సూర్ గ్రామానికి చెందిన నక్క శ్యాం యాదవ్ (21) తెలంగాణ రాదేమోననే బెంగతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా, తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని కలత చెంది మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన కొమ్ము యాదయ్య (34) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications