తప్పనిస్థితిలో టికి ఓకే చెప్పా, బొమ్మా-బొరుసు: బాబు
గుంటూరు/హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ బొమ్మా - బొరుసు ఆట ఆడుతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో తాను అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. గుంటూరు జిల్లాలో చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర కొనసాగుతోంది. నిడమర్రులో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కీలక సమస్యను ఏళ్లుగా నాన్చి, రెండు ప్రాంతాల్లో విద్వేషాలను రెచ్చగొట్టిందని విమర్శించారు.
ఓట్లు, సీట్ల కోసం తెలుగు జాతి మధ్య కాంగ్రెసు పార్టీ చిచ్చు పెట్టిందన్నారు. తెలంగాణపై తాను తప్పనిసరి పరిస్థితుల్లో అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని కానీ, సీమాంధ్రకు న్యాయం చేయమని కోరానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారని, ఆ ఎన్నికల ద్వారా టిడిపి బలపడిందని గుర్తించిన కాంగ్రెసు విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.

హైదరాబాదు రాష్ట్రానికి గుండెకాయ వంటిదన్నారు. హైదరాబాదులోని అన్ని శాఖలలో ఉద్యోగులు రెండు వర్గాలుగా మారి పోటీ పడుతున్నారని, విద్యుత్ సౌధలోను ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. ఢిల్లీ పెద్దలు రెండు ప్రాంతాల వారితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు.
సభను ఆపే సత్తా ఎవరికీ లేదు: అశోక్ బాబు
ఎపిఎన్జీవోల సభను ఆపే సత్తా ఎవరికీ లేదని ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాదులో అన్నారు. బహిరంగ సభను తాము శాంతియుతంగా నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. న్యాయస్థానం నుండి అనుమతి వచ్చాక సభ సరికాదని చెప్పడమేమిటన్నారు. సభను అడ్డుకుంటే తెలంగాణవాదనలో పస లేనట్లే అన్నారు. తాము ఎవరికి వ్యతిరేకంగా సభ నిర్వహించడం లేదని, అవగాహన సభ మాత్రమే అన్నారు. ఎవరు రెచ్చగొట్టనా సభకు వచ్చే వారు మాత్రం సంయమనం పాటించాలని కోరారు.












Click it and Unblock the Notifications