వంగపండుకు చుక్కెదురు: 'గజల్' శ్రీకి గద్దర్ స్ఫూర్తి
హైదరాబాద్: ఎపి ఎన్జీవోల సేవ్ హైదరాబాద్ సభ వద్ద ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావుకు చేదు అనుభవం ఎదురైంది. సేవ్ హైదరాబాద్ సభలో సాంస్కృతిక ప్రదర్శన ఇద్దామని వచ్చిన వంగపండు ప్రసాదరావును పోలీసులు ఎల్బీ స్టేడియంలోకి అనుమతించలేదు. తొలుత గజల్ శ్రీనివాస్‌ను కూడా అనుమతించలేదు.
అయితే, ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు జోక్యం చేసుకుని - గజల్ శ్రీనివాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని పోలీసులకు చెప్పారు. దాంతో గజల్ శ్రీనివాస్‌ను లోనికి అనుమతించారు. వంగపండు ప్రసాదరావు విషయంలో మాత్రం ఎవరూ జోక్యం చేసుకున్నట్లు కనిపించడం లేదు. ఆయన ప్రదర్శన ఎల్బీ స్టేడియంలో కనిపించలేదు. ఉత్తరాంధ్రకు చెందిన వంగపండు ప్రసాద రావు గతంలో నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. ఆయన రాసిన విప్లవ గీతాలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి.

కాగా, తనకు తెలంగాణకు చెందిన గద్దర్, గోరటి ఎంకన్న, అందెశ్రీ, రసమయి బాలకిషన్ ప్రేరణ అని ఆయన చెప్పారు. గజల్ శ్రీనివాస్ రూపొందించిన సమైక్యాంధ్ర పాటల సిడిని అశోక్ బాబు ఆవిష్కరించారు. తెలంగాణలో ఎంతో మంది మంచి పాటలు రాశారని అశోక్ బాబు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం బలమైన పాటలు రాశారని ఆయన గజల్ శ్రీనివాస్‌ను అభినందించారు.

గజల్ శ్రీనివాస్ సేవ్ హైదరాబాద్ వేదికపై నుంచి పాటలు పాడడమే కాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనల్లో గజల్ శ్రీనివాస్ క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications