జయసుధ భర్త కారులో మంటలు: తప్పిన ప్రమాదం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు రేగాయి. నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అది కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ భర్త నితిన్ కపూర్ కారు.

ఆయన మారుతి కారులో డ్రైవర్ ఉమాశంకర్, పనిమనిషితో కలిసి మంగళవారం మణికొండలోని వారి ఫ్లాట్‌కు వెళ్లారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా గచ్చిబౌలి ఫ్లై ఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మాదాపూర్ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై కారును వెంటనే ఆపేయడంతో ప్రమాదం తప్పింది.
ప్రాణాలు తీసిన సరదా
ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు కళాశాల సమీపంలోని చెరువులో శవమై తేలారు. కూకట్‌పల్లి, బాలానగర్‌కు చెందిన పి. సందీప్ (23), సాయిపునీత్ (22) నగరశివారు కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు.
మంగళవారం కాలేజీకి వెళ్లకుండా అదే కళాశాలకు చెందిన మరో స్నేహితుడు బి. సాయిరాంరెడ్డితో కలిసి మైసమ్మగూడలోని ఓ గుట్ట వద్ద మద్యం తాగారు. స మీపంలోని కోమటి చెరువు వద్దకు వచ్చి కాసేపు కాలక్షేపం చేశారు.
చెరువు కట్టపై కూర్చున్న ముగ్గురిలో మొదట సందీప్ ఈతకని వెళ్లి మునిగాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన సాయిపునీత్ కూడా ప్రమాదానికి గురయ్యాడు. వారిద్దరిని బయటకు తీసుకువచ్చేందుకు వెళ్లిన సాయిరాంరెడ్డి కూడా నీటిలో మునుగుతుండగా కేకలు వేయడంతో స్థానికుడు సామ్‌సన్ అతడిని ప్రాణాలతో కాపాడాడు. సందీప్, పునీత్ చెరువులో గల్లంతైన విషయం సాయిరాంరెడ్డి వెంటనే కళాశాలలోని స్నేహితులకు చేరవేశాడు.
కళాశాల సిబ్బంది పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఆ విద్యార్థుల కోసం గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం వారి మృతదేహాలను వెలికి తీసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications