జగన్ కేసు తుదిఛార్జీషీట్: వెంకటేష్ స్థానంలో చంద్రశేఖర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తులో కీలకపాత్ర పోషిస్తున్న సిబిఐ డిఐజి హెచ్ వెంకటేష్‌కు స్థాన చలనం కలిగింది. ఇప్పటికే సిబిఐ జెడిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తన సొంత కేడర్ మహారాష్ట్రకు వెళ్లిపోయారు.
ఇప్పుడు వెంకటేశ్ కూడా తన సొంత కేడర్ కేరళకు వెళ్లిపోనున్నారు. మరో రెండుమూడు రోజుల్లోనే మిగిలిన చార్జిషీట్లు కూడా దాఖలు చేయనున్నారు. ఆ వెంటనే వెంకటేశ్ సిబిఐ డిఐజిగా రిలీవ్ అవుతారు. కేరళ కేడర్ ఐపిఎస్ అధికారి అయిన వెంకటేశ్ డిప్యుటేషన్‌పై ఆగస్టు 2010లో హైదరాబాద్‌కు వచ్చారు. సిబిఐలో ఆయన డిప్యుటేషన్ గడువు గత నెలలోనే ముగిసింది.
అయితే, జగన్ కేసు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా దర్యాప్తు అధికారులను బదిలీ చేయరాదన్న న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించారు. ఇప్పుడు జగన్ కేసులో దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. మంగళవారం సిబిఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.
మరో మూడు అంశాలపై రెండు మూడు రోజుల్లోనే చార్జిషీట్లు వేయనున్నారు. ఇవి దాదాపుగా పూర్తయ్యాయని, కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. అది ముగియగానే ఈ నెల 14వ తేదిన వెంకటేశ్ తుది చార్జిషీట్లను కోర్టుకు సమర్పించే అవకాశముంది. ఆ వెంటనే సోమవారం ఆయన సిబిఐ నుంచి రిలీవ్ అవుతారు.












Click it and Unblock the Notifications