ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో తిరుగుతున్న పులి బండి సంజయ్; వేట షురూ!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ నిర్వహిస్తున్న ఐదవ విడత పాదయాత్రను అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నం జరిగినా, కోర్టు అనుమతితో పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ ను ఉద్దేశించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో నాలుగు పులులు తిరుగుతున్నాయని పేర్కొన్న ఆయన, అందులో బండి సంజయ్ ఒకరు అంటూ వ్యాఖ్యానించారు.

చిరుత పులుల్లా టిఆర్ఎస్ నాయకులను వేటాడండి
భూకబ్జాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను వేటాడడానికి, వారి ఆగడాలను ప్రజలకు తెలియజేయడానికి బండి సంజయ్ తిరుగుతున్నారని సోయం బాపురావు వ్యాఖ్యలు చేశారు. అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయని టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సోయం బాపూరావు, చిరుత పులుల మాదిరిగా మీరంతా టిఆర్ఎస్ నాయకులను వేటాడాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అన్ని విధాల రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని సోయం బాపురావు మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకుండా రైతు సోదరులను మోసం చేశారంటూ ఆయన పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా నిద్రపోకండి
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన, బీజేపీ అధికారంలోకి తీసుకు వచ్చేదాకా నిద్ర పోకుండా ప్రతి ఒక్కరు కష్టపడాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో పాల్గొన్న సోయం బాపురావు చాలా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలను, శ్రేణులను ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండేలా ప్రతి ఒక్కరూ చిరుతపులులు అవ్వాలన్నారు. టిఆర్ఎస్ పార్టీని, పార్టీ నాయకులను వేటాడాలి అన్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం ఇప్పటి నుంచే ముందుకు కదలాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు.

బిజెపికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ వణికిపోతున్నారు
అంతకు ముందు ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సమయంలో కూడా సోయం బాపురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కు భయపడే యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించిన ఆయన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని సోయం బాపురావు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందని పేర్కొన్న ఆయన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. బిజెపికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ వణికిపోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications