ఆఫ్ఘన్‌లో తాలిబన్లు.. తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ: షర్మిల విసుర్లు
యువకులు, విద్యార్థులు, మేధావులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. నిరంకుశ కేసీఆర్ చేతిలో పెట్టి మోసపోయామని వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యమకారుడనే ఉద్దేశంతో ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తాడనే నమ్మకంతో కేసీఆర్ చేతిలో అధికారం పెట్టామని చెప్పారు. విద్యార్థులను, యువకులను ఉరికంబం ఎక్కిస్తున్నాడని.. ఉద్యమ సమయంలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులను నేడు బలిపీటం ఎక్కిస్తున్నాడని ఫైరయ్యారు. వందల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వానపడట్టు మరణించేవాళ్లు మన వాళ్లు కాదు కదా.. నా ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయని కేసీఆర్ మురిసిపోతున్నాడని మండిపడ్డారు. ఫాం హౌజ్‌లో మత్తునిద్రలో ఉన్న కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో కూడా తెలియదన్నారు. ఎంతమందికి గ్రాడ్యుయేట్లు ఉన్నారు? ఎంతమంది ఉద్యోగాలు కోరుకుంటున్నారో కనీస అవగాహన లేదన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప టీఎస్ పీఎస్సీకి సభ్యులను నియమించలేదన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా దండెపల్లిలో జరిగిన నిరుద్యోగ నిరహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు.

నోటిఫికేషన్లు ఏవీ..?
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఎంతోమంది నిరుద్యోగులు బతికేవారని చెప్పారు. తల్లిదండ్రులకు కేసీఆర్ కడుపుకోత విధించారని చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం.. కేసీఆరే హంతకుడు అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఏడేండ్లలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు నిరుద్యోగులు కనీసం పట్టించుకోలేదు. మన పిల్లల్ని చంపుకోడానికేనా తెలంగాణ తెచ్చుకుంది? అని అడిగారు. ఇంకెంత మంది చనిపోతే కేసీఆర్ కండ్లు చల్లబడుతాయి. ఇందుకేనా తెలంగాణ రాష్టాన్ని తెచ్చుకుంది? అని అడిగారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పనికిమాలిన పాలన చేస్తున్నాడని ఫైరయ్యారు. ఉద్యమంలో ఏం చెప్పాం.. ప్రస్తుతం ఏం చేస్తున్నామనే సోయి కూడా లేదన్నారు. ప్రజల గురించి ఆలోచన చేయని సీఎం ప్రజలకు అవసరం లేదన్నారు. వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారు లేకపోవడంతోనే కేసీఆర్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు.

కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుంటే, ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుందని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వందల మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీ కంటికి కనిపించడం లేదా? దీనిపై ప్రశ్నించడానికి నోరు రావడం లేదా? మీరు ఏమైనా మౌన వ్రతం చేస్తున్నారా? లేదా గుడ్డివాతం చేస్తున్నారా? లేక ప్రశ్నిస్తే నీ తండ్రి పదవి నుంచి పీకేస్తాడని భయపడుతున్నారా? తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఎలా బానిస అయిందో ఏడేండ్ల తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో బందీ అయిందన్నారు.

16 లక్షల ఎకరాలకు నీళ్లు..
వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేవలం 35 వేల కోట్లతోనే 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందేది. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 2 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందేది. కాళేశ్వరం అని గొప్పగా చెప్పుకునే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వైయస్ఆర్ నిర్మించిందే. ఈనాటి పాలకులు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తామన్నారు. హైదరాబాద్ కాదు కదా.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎల్లంపల్లి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాలకు గాని సింగరేణికి గాని కనీసం తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఫైరయ్యారు. కేసీఆర్ హయాంలో వాళ్ల బతుకులు ఆగమయ్యాయని చెప్పారు. అటు ఫీల్డ్ అసిస్టెంట్లను, ప్రైవేట్ టీచర్లను తొలగించి, వారి బతుకులు రోడ్డుపాలు చేశారని చెప్పారు.

బందీ
ఏడేండ్ల తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మేజర్ ప్రాజెక్టులు వైఎస్ఆర్ నిర్మించినవేనని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ, రిమ్స్ మెడికల్ కాలేజీ లాంటి ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. గిరిజనులకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ అని చెప్పారు. ప్రజల గురించి ఆలోచన చేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని.. ఐదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, పక్కా ఇండ్ల పథకం, ఇలా ఎన్నో పథకాలు చేపట్టారని వివరించారు. 5 ఏళ్లలో మూడు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలు కల్పించారు. కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లోన్లు ఇచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు.

ప్రజా వ్యతిరేక పాలన
కేసీఆర్ పూర్తిగా ప్రజావ్యతిరేక పాలన అందిస్తున్నాడని ఫైరయ్యారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు దళితులు బంధువులయ్యారని చెప్పారు. నిరుద్యోగులు మాత్రం శత్రువులయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని పిలుపునిస్తున్నామని వివరించారు. ఎన్నికలో మద్దతుగా నిలబడతాం.. ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తాం. నిరుద్యోగులంతా నామినేషన్లు వేసి కేసీఆర్ మెడలు వంచాలని కోరారు. వందల సంఖ్యలో నామినేషన్లు వేసి కేసీఆర్ నిరంకుశ పాలన గురించి ప్రపంచానికి తెలియజేస్తాం అని చెప్పారు. దేశమంతా నిరుద్యోగ సమస్య గురించి తెలిసేలా చేస్తాం. నిజామాబాద్‌లో కేసీఆర్ కుటుంబానికి ఎలా బుద్ధి చెప్పారో.. హుజూరాబాద్‌లో గట్టి బుద్ధి చెప్పాలన్నారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. అండగా నిలబడతామని చెప్పారు. ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. కొత్త జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వాటిని కూడా భర్తీ చేయాలని.. 54 వేల మందికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలని కోరారు.
Recommended Video

మొట్టికాయలు వేస్తే తప్ప
కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నరేష్ నాయక్ లాంటి అనేక మంది యువకులు బతికే వారని చెప్పారు. కేసీఆర్ నిర్వాకంతో ఏడేళ్లలో నిరుద్యోగం తీవ్రమైందన్నారు. గడిచిన ఏడు రోజుల్లో ముగ్గురు నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని చెప్పారు. ఈ చావులకు కారణం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications