నరేంద్రమోడీ బాటలో అమరావతి రైతులు?
అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 1100 రోజులకు చేరుకుంది. మూడు సంవత్సరాలకు పైబడి ఉద్యమం చేస్తున్నప్పటికీ స్పందించని ప్రభుత్వ తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అమరావతి అన్నదాతలు ఇటీవలే 'ధరణికోట నుంచి ఎర్రకోట' కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసనను జాతీయస్థాయిలో వినిపించారు.

ఢిల్లీ నుంచి మట్టిని తెచ్చిన రైతులు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటలో అమరావతి రైతులు ముందుకు కదులుతున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడంతోపాటు రాంలీలా మైదానంలో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో కలిసి పాల్గొన్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని ఢిల్లీ నుంచి మట్టి, నీరు తీసుకొచ్చారు. అలాగే రైతులు కూడా ఢిల్లీ నుంచి మట్టిని తీసుకొని అమరావతికి వచ్చారు.

ఢిల్లీని మంచి కడతామని ఆర్భాటంగా ప్రకటించారు..
దాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు, గ్రామాలకు పంపించనున్నారు. ఢిల్లీని మంచి రాజధానిని కడతామని కొంతమంది నేతలు ఆర్భాటంగా ప్రకటించారని, వారందరినీ ఎండగట్టాలన్నారు. రానున్న తరాల మంచి భవిష్యత్తు కోసం అమరావతిని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లడం అత్యంత దారుణమన్నారు.

1100 రోజులు పూర్తిచేసుకున్న ఉద్యమం
దేశ రాజధాని ఢిల్లీలో చలి విపరీతంగా ఉందని అటువంటి చలిని లెక్కచేయకుండా ఢిల్లీ యాత్ర చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీని ఎలా తయారుచేశారో అందరికీ వివరించామన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం 3 సంవత్సరాలు పూర్తిచేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతుందని చెప్పడానికి ఎంతో బాధగా ఉందన్నారు.
ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని గద్దె దించేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఉద్యమం 1100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మందడం, తుళ్లూరు, వెంకటపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెం, వెలగపూడి, దొండపాడు, నెక్కలు, తాడికొండ, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.












Click it and Unblock the Notifications