ఇన్‌పుట్ సబ్సిడీ జమ.. రూ.534.77 కోట్లు, 5.71 లక్షల మంది రైతులకు మేలు..
రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరోసారి అన్నదాతలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. మంగళవారం రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయనుంది. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేస్తారు.
రాష్ట్రంలోని 5,71,478 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రూ.534.77 కోట్లు జమ చేయనున్నారు. దీనితో 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద 29.51 కోట్ల మేలుచేకూరనుంది. ఇన్‌పుట్ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కలిపి మొత్తం 564.28 కోట్లు పంపిణీ చేయనున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించారు.
ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చిందని జగన్ గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జగన్ భరోసా ఇచ్చారు.

ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని ఆయన స్పష్టంచేశారు తెలిపారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలే తమకు ముఖ్యం అని చెప్పారు.
ఇటు బీసీలకు కూడా జగన్ సర్కార్ ఆదుకుంటుంది. జగనన్న చేదోడు పథకం కింద నాయీబ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు ఏపీ సర్కార్ సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ కూడా చేసింది. అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు పథకం లబ్ది మిస్ అయిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications