జగన్ అలా కాదు.. ఎవరికీ వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే రోజా
3 రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇందులో మర్మం ఏముందో అనుకునే లోపే.. జగన్ క్లారిటీ ఇచ్చారు. మరింత విసృతంగా సంప్రదింపులు జరుపుతామని.. ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి విపక్షాలు విమర్శలు చేయడంతో.. అధికార పక్షం కౌంటర్ అటాక్ చేస్తోంది. తమ విధానం అలా కాదు అని స్పష్టం చేస్తోంది.
అధికార వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్వాగతించారు. రాజధానికి, రాజధాని రైతులకు సీఎం జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ ఒకేచోట అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే హైదరాబాద్ విషయంలో జరిగిందే ఏపీలోనూ జరుగుతుందేమోననే ఆలోచనతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా వివరించారు. ఇప్పటికే వెనుకబడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మళ్లీ ఉద్యమానికి పూనుకుంటే రాష్ట్రంలో సమస్యలు వస్తాయని సీఎం గుర్తించారని తెలిపారు. అందుకే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.

కొత్త బిల్లు తెచ్చే క్రమంలో రైతులు, న్యాయస్థానాలు కేసులు వేసిన వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రోజా వివరించారు. సమగ్రంగా అభిప్రాయాలు సేకరించి, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగని రీతిలో విస్తృతస్థాయిలో చర్చించి అసెంబ్లీలో కొత్త బిల్లుతో వస్తారని వెల్లడించారు. అంతేకానీ పని పట్టుకొని విమర్శలు చేయడం సరికాదని కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుందని వివరించారు. కానీ కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
3 రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ వెనక్కి తీసుకుంది. రైతులు, హైకోర్టు తీర్పులతో.. మరిన్ని సవరణలు చేసి.. పకడ్బందీగా ముందుకెళ్తామని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో రాజధాని అంశం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడింది తప్ప.. పర్మినెంట్ కాదని జగన్ చర్యలతో అర్థం అవుతోంది. దీనికి తగ్గట్టే మంత్రులు.. ఇతరులు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications