జగనన్న తోడు పథకం వాయిదా.. గౌతమ్ మరణంతో పోస్ట్ పోన్, మళ్లీ ఎప్పుడంటే..
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణంతో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే రెండు విడతలు అర్హులను గుర్తించి నగదు అందజేశారు. అయితే గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో పథంక అమలు ఈ నెల 28వ తేదీన అందజేయనున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా ఏపీ సర్కార్ రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనుంది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వరుసగా మూడో ఏడాది కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టగా.. మరికొన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నారు. ఈ నెలలో 'జగనన్న తోడు' పథకం అమలు చేయనుంది. పథకం కింద చిరు వ్యాపారులకు మూడో విడత కింద లబ్ధి చేకూర్చనుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించారు. బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా ఇప్పటివరకు 6,91,530 మంది లబ్దిదారులు రుణాలను అందజేశారు.

మూడో దశలో మరో 1,57,760 మంది రుణాలు పొందనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జగనన్న తోడు పథకం కింద ఒక్కో చిరు వ్యాపారికి ఏటా రూ.10 వేల వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రూ.10 వేలకు ఏడాదికి అయ్యే వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు అందించనుంది.
చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఏటా రూ. 10 వేల వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని లబ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత.. తిరిగి వారు బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications