దారిద్య్రాలు, దౌర్జన్యాలు..బహిష్కరించే ఆక్రోశం: హాట్ టాపిక్‌గా అనంతపురం కలెక్టర్ కామెంట్స్
అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. మరోసారి తన అభ్యుదయ భావాలను చాటి చెప్పారు. మండుటెండల్లో చెప్పులు లేకుండా పల్లెల్లో పర్యటిస్తోన్న ఆయన గ్రామీణులతో మమేకం అవుతున్నారు. వేసవి సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులకు పనులను కల్పిస్తున్నారు. ఆ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలను కలిసి, వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు.
రెండు రోజులుగా గంధం చంద్రుడు సాగిస్తోన్న క్షేత్రస్థాయి పర్యటనలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాజకీయంగా ప్రాధాన్యతనూ సంతరించుకుంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజుల కిందటే- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మవరం శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఆయనపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కాక రేపిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్ మిగిల్చిన ప్రకంపలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న పరిస్థితులలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటను చేపట్టడం రాజకీయ కోణంలోనూ ఆసక్తిగా మారాయి.

ఈ పరిణామాల మధ్య కొద్దిసేపటి కిందటే గంధం చంద్రుడు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. వాటికి తనదైన శైలిలో అభ్యుదయ భావాలతో కూడిన కామెంట్స్‌ను జత చేశారు. కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు, పరిష్కరించే, బహిష్కరించే, నాలో కదిలే ఆక్రోశం, కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి..అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన భీమ్ దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో ఉన్న గంధం చంద్రుడు చెప్పులు వేసుకోట్లేదు. నీలం రంగు షర్ట్‌ను ధరిస్తున్నారు. వేసవిలో గ్రామాలకు కల్పించిన మంచినీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పనుల గురించి ఆరా తీస్తున్నారు.

వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల పథకాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. అర్హులైన మరికొంత మంది పనులు కల్పించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 2,30,000 వేల మందికి నరేగా కింద పని కల్పించామని, మున్ముందు ఈ సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఇదివరకు ఆరున్నర లక్షల మందికి పని కల్పించిన విషయాన్ని గంధం చంద్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేసవి కాలం, కోవిడ్ నేపథ్యంలో కూలీలు అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.