పరిటాలకు ఈసారైనా విజయం దక్కేనా?
Raptadu Assembly round up: అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం.. మరోసారి టఫ్ ఫైట్‌కు కేంద్రబిందువు కానుంది. అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోనుంది. జిల్లాలో అత్యంత ప్రత్యేకత, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత గల నియోజకవర్గం కావడమే దీనికి కారణం.
అనంతపురం లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు.. రాప్తాడు. అనంతపురం టౌన్‌కు ఆనుకుని ఉంటుంది. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. అనంతపురం మండలంలోని కొన్ని ప్రాంతాలు రాప్తాడు అసెంబ్లీ పరిధిలో ఉంటాయి.

2,45,435 మంది ఓటర్లు ఉన్నారిక్కడ. 2009లో చోటు చేసుకున్న నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఆవిర్భవించిన స్థానం ఇది. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లు తెలుగుదేశం, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠభరితంగా మారింది. రెడ్డి, బీసీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలు ఉంటుందీ నియోజకవర్గం పరిధిలో.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన పరిటాల కుటుంబానికి రాప్తాడు నియోజకవర్గం కంచుకోట. గతంలో పరిటాల ఫ్యామిలీ పెనుకొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తమకు బలం ఉన్న మండలాలు రాప్తాడులో కలవడంతో ఇక్కడికి షిఫ్ట్ అయింది.
2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత.. రాప్తాడు నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టాలనే కల నెరవేరలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ జెండా పాతింది. ఆ పార్టీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25 వేలకు పైగా మెజారిటీతో విజయఢంకా మోగించారు.
ఈ సారి కూడా ఈ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొంది. రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీత పేరును ఖరారు చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. చంద్రబాబు నాయుడు ఇటీవలే విడుదల చేసిన జాబితా సందర్భంగా సునీత పేరును ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ- వైఎస్ఆర్సీపీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే పోటీ చేయడం దాదాపుగా ఖాయం.












Click it and Unblock the Notifications