అలా చేయకపోతే.. పెన్నా నదిలో దూకుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇసుక అక్రమాలను నిరూపిస్తానని.. అలా చేయకుంటే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
అనంతపురం: ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి తాడిపత్రి నియోజకవర్గంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమాలను నిరూపిస్తానని.. అలా చేయకుంటే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
పెద్దపప్పూరులో ఇసుక అక్రమాలను చూసేందుకు వెళితే.. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో జరుగుతున్న అక్రమాలపై వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను మనుషులతోనే రోజుకు 20 మంది చొప్పున తవ్వాలని.. 300 రోజులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే లోడింగ్ చేయాలన్నారు.

పెన్నా నదిలో ఇసుకను దోచేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి
అంతేగాక, ఒకరోజుకు 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లలో మాత్రమే ఇసుక తోలుకోవాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ, అక్కడ మాత్రం 200 హెచ్‌పీ సామర్థ్యం గల ఐదు మిషన్లతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని.. 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. పెన్నానదిలో లోడింగ్ కు 23 టన్నుల ఇసుకకు రూ. 8550 వసూలు చేస్తున్నారన్నారు. కానీ, మార్కెట్ డిమాండ్ ను బట్టి రూ. 16వేలు నుంచి రూ. 40 వేల వరకు దండుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

పెన్నా నదిలో దూకుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం
భారీగా ఇసుక తవ్వకాలతో ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని జేసీ మండిపడ్డారు. ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారని.. తాను కూడా వారితో కలిసి వెళ్లి పెన్నా నది నీటిలో దూకుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ కోసం అధికారులే బాధ్యత వహించాలని, వారు దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. ప్రజలకు ఇసుక అక్రమాలపై వివరిస్తానన్నారు.












Click it and Unblock the Notifications