tirumala laddu: ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యాల్సింది పవన్ కాదు చంద్రబాబు!
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీలో అధికార ఎన్డీయే కూటమి పార్టీలకు, వైసీపీకి మధ్య రగడ కొనసాగుతుంది. చంద్రబాబు కావాలనే ఈ కుట్ర చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తల దాడి యత్నాన్ని ఖండించిన మాజీ మంత్రి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని కోరారు.
చంద్రబాబువి నీచ రాజకీయాలు
వెంకటేశ్వరస్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు, ఎల్లో మీడియా దారుణ ఆరోపణ చేస్తోందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

చంద్రబాబు ఆధారాలు చూపించు
ఇదంతా టీడీపీ, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఇలా చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. దానికి ఆధారాలు చూపించాలని నిలదీశారు. అందుకు వారు చూపిస్తున్న ఎన్‌డీడీబీ రిపోర్టు గత జూలై 23న వచ్చిందన్న ఆయన, అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే అని గుర్తు చేశారు.
టీటీడీ ఈవో వ్యాఖ్యలు అప్పుడలా.. ఇప్పుడిలా
అదే రిపోర్టుకు సంబంధించి, ఆనాడు మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, లడ్డూ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యత పరీక్షిస్తే.. అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి కలిపినట్లుగా తేలిందని, ఆ నెయ్యిని రిజెక్ట్ చేశామని, ఇంకా ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత లడ్డూపై చంద్రబాబు ఆరోపణల తర్వాత, టీటీడీ ఈఓ, మాట మార్చారని గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు
కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తూ, టీటీడీని, వెంకటేశ్వరస్వామి వారిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు .తమ పార్టీ నేతలు స్వామి వారి చెంత కుటుంబ సమేతంగా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే, స్పందన లేదన్నారు అంబటి రాంబాబు. దైవాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పరువు మీద దాడికి ప్రయత్నిస్తే తిరుమల వెంకన్న కూడా సహించరన్నారు.
ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కాదు చంద్రబాబు చెయ్యాలి
ఎంత మంది చెప్పినా అబద్ధం నిజమైపోదన్న మాజీ మంత్రి, జగన్‌గారి హయాంలో ప్రసాదాల తయారీలో ఏ పొరపాటు, తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే, నిరూపించాలని సవాల్ చేశారు. పవన్‌కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను ప్రస్తావించిన మాజీ మంత్రి, అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని, క్షమాపణ చెప్పి, సంప్రోక్షణ చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications