ఏపీలో కొత్తగా 1115 కరోనా కేసులు, 19 మరణాలు: కర్నూలులో సింగిల్ డిజిట్, మిగితా జిల్లాల్లో కేసులు ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు ఉంటున్నాయి. తాజాగా, 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 52,319 నమూనాలను పరీక్షించగా.. 1115 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1115 కరోనా కేసులు, 19 మంది మృతి
తాజాగా నమోదైన 1115 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు.
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నలుగురు మరణించగా, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,857 మృతి చెందారు.

ఏపీలో 14,693 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1265 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,85,566కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 14,693 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,66,29,314 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 09 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాలవారీగా కొత్త కరోనావైరస్ కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 21, చిత్తూరులో 210, తూర్పుగోదావరిలో 210, గుంటూరులో 121, కడపలో 36, కృష్ణాలో 165, కర్నూలులో 09, నెల్లూరులో 120, ప్రకాశంలో 121, శ్రీకాకుళంలో 50, విశాఖపట్నంలో 48, విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,85,664, చిత్తూరులో 2,38,167 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,423) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే
ఇది ఇలా ఉండగా దేశం తాజాగా నమోదైన కరోనా కేసులు అంతకుముందు రోజుతో పోల్చుకుంటే తగ్గాయి. ముందు రోజుతో పోల్చితే 27.9 శాతం మేర క్షీణించాయి. మృతుల సంఖ్య కూడా తగ్గింది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 13,94,573 మంది నమూనాలను పరీక్షించగా.. 30,941 మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే, తగ్గిన పరీక్షల సంఖ్య కూడా కేసుల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. కాగా, ఒక్క కేరళ రాష్ట్రంలోని 19వేల కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 350 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,70,640 కరోనావైరస్ యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 36,275 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.13 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. 3.19 కోట్ల మంది కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,38,560 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల వ్యవధిలో 59,62,286 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 64 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications