ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు
ఏపీలో రైతులకు మంచి శుభవార్తే అనుకోవచ్చు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు వారు కోరుకుంటున్నదానికంటే ఎక్కువగానే మార్కెట్ ధర నడుస్తోంది. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం భారీగా వచ్చే అవకాశముందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకన్నా బహిరంగ మార్కెట్ ధరే ఎక్కువగా నడుస్తోంది. ఈ ఏడాది మొక్కజొన్న పంట దిగుబడి తగ్గుతున్నట్లు అంచనాలున్నాయి. కత్తెర పురుగు వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణం. ప్రభుత్వ మద్దతు ధర రూ.2వేలు ఉండగా మార్కెట్ లో క్వింటా రూ.3వేలు పలుకుతోంది.
కృష్ణా జిల్లాలో 4వేల ఎకరాల్లో సాగు
ఈ ఖరీఫ్ సీజన్ లో ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు నాలుగువేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పంటను కత్తెర పురుగు దెబ్బతీస్తోందన్నారు. దీని నివారణకు సరైన మందు లేదని, ఫెర్టిలైజర్లు ఎక్కువగా ఉపయోగిస్తే తయారీదారులు పంటను కొనడంలేదని చెప్పారు. పాప్ కార్న్, స్వీట్ కార్న్ తయారీదారులే ఎక్కువగా రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సారి దిగుబడి తక్కువగా ఉండటంతో అధిక రేటు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారంటున్నారు. రైతులు మాత్రం కత్తెర పురుగు నివారణకు మందు కనిపెట్టాలని వ్యవసాయశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

నాణ్యతను బట్టి ధర
నవంబరు, డిసెంబరు నెలల్లో వరి కోతలు కోసిన తర్వాత మొక్కజొన్న విత్తులు విత్తుకోవాలి. తేమను నిలుపుకునే నేలలో మాత్రమ మొక్కజొన్నను సాగుచేయాల్సి ఉంటుంది. వరి కోతల తర్వాత భూమిపై తడి లేకపోతే తేలికపాటి తడి ఇచ్చి మొక్క జొన్న విత్తనాలను చల్లాలి. పంటకు మంచి మార్కెట్ ధర రావాలంటే నాణ్యతా ప్రమాణాలను పాటించడం తప్పనిసరి. అన్నదాతలంతా ఈ విషయాన్ని కచ్చితంగా పాటించాలి. గింజల్లో 14 శాతానికి మించకుండా తేమ ఉండాలి. అలాగే పాడైన గింజలు 1.5 శాతానికి మించకుండా చూసుకోవాలి. రాళ్లు, పెళ్లలు, చెత్త మట్టి, దుమ్ములాంటివి, ఇతర ఆహార గింజలు ఒక శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే కీటకాలు ఆశించిన గింజలు కూడా ఒక శాతానికి మించకూడదు. అప్పుడు నాణ్యమైన మొక్కజొన్న పండుతుంది. అన్నదాతలకు అధిక ధర వస్తుంది. ఎంత నాణ్యతను పాటిస్తే అంత ధర వస్తుందనుకోవచ్చు.












Click it and Unblock the Notifications