ఒకేసారి టెన్త్ పాసైన తల్లీకొడుకులు.. ఎక్కడంటే ???
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల్లో ఒక తల్లి-కొడుకు కథ ఇప్పుడు అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీలహరి.. తన కుమారుడు విజయ్‌తో కలిసి పరీక్షలు రాసి విజయం సాధించడం విశేషం. ఆరో తరగతిలోనే చదువు ఆపేసిన ఆమె, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పుస్తకం పట్టి, ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పరీక్షలు రాయడం ఆమె సంకల్పానికి నిదర్శనం. విజయ్ 562/600 మార్కులతో అద్భుతంగా రాణించగా, లక్ష్మీలహరి 360/500 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
తన కుమారుడు రెగ్యులర్ విద్యార్థిగా చదువుకుంటుండగా, తల్లి కూడా అతనితో పాటు చదవాలని నిర్ణయించుకుంది. ఇంటి పనులు, బాధ్యతలు చూసుకుంటూనే చదువుకు సమయం కేటాయించి, ప్రతి రోజూ క్రమశిక్షణతో సిద్ధమైంది. చివరికి వచ్చిన ఫలితాలు ఈ తల్లీకొడుకుల కష్టానికి ప్రతిఫలం చూపించాయి. ఫలితాలు చూసిన క్షణం ఇద్దరూ ఆనందంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా లక్ష్మీలహరి కథ కేవలం ఒక ఫలితం మాత్రమే కాదు-"చదువుకు వయసు అడ్డుకాదు" అనే సందేశాన్ని స్పష్టంగా చెబుతోంది. తన కుమారుడికి ఆదర్శంగా నిలవాలని ఆమె తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా మారింది. గ్రామంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఆమె కథ వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. పలువురు విద్యావేత్తలు, స్థానికులు ఆమె పట్టుదలను కొనియాడుతున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, ఈసారి టెన్త్ ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి తమ ప్రతిభను చాటుతూ 87.90%తో బాలుర కంటే ముందంజలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం కూడా 78.39%కి పెరగడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా 96.07%తో అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 57.02%తో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేసింది.
రాష్ట్రంలో మొత్తం 2161 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించడం ఒక మంచి పరిణామం. అయితే మరోవైపు, 16 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 11 ప్రైవేట్ స్కూళ్లు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది.
అలాగే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 25 నుండి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యాశాఖ, నిపుణులు విద్యార్థులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఒకసారి ఫెయిల్ అవ్వడం అంటే అంతే కాదు, అది మరో అవకాశానికి నాంది. తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే, తదుపరి పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందకుండా, కుటుంబం, ఉపాధ్యాయుల సహకారంతో మళ్లీ ప్రయత్నించాలని సూచించారు.












Click it and Unblock the Notifications