ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి: కొత్త వెయ్యికిపైగా కేసులు: పెరుగుతున్న రికవరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. తాజాగా, 1100కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,307 నమూనాలను పరీక్షించగా.. 1167 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1167 కరోనా కేసులు, ఏడుగురు మృతి
తాజాగా నమోదైన 1167 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,45,657కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 07 మంది మృతి చెందారు.
కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,125కి పెరిగింది.

ఏపీలో 13,208 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1487 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,18,324కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 13,208 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,80,36,099 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 224 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 01 కేసు కొత్తగా నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 11, చిత్తూరులో 167, తూర్పుగోదావరిలో 224, గుంటూరులో 110, కడపలో 91, కృష్ణాలో 113, కర్నూలులో 09, నెల్లూరులో 141, ప్రకాశంలో 130, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 37, విజయనగరంలో 01, పశ్చిమగోదావరిలో 121 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,90,482, చిత్తూరులో 2,43,121 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,726) కరోనా కేసులున్నాయి.

దేశంలో తగ్గిన కరోనా కేసులు, పెరిగిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి 30వేలకు దిగువనే నమోదయ్యాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,92,421 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 29,616 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.36 కోట్లకు పెరిగింది. శుక్రవారం 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,46,658లకు పెరిగింది. శుక్రవారం 28,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,28,76,319కు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,01,442 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.90 శాతంగా ఉంది. గురువారం 71 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 84.89 కోట్లకు చేరింది. కాగా, కేరళలో కొత్తగా 17,983 కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications