TTD: 21 నిమిషాల్లోనే పూర్తయిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు, మరో ఛాన్స్..!!
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలి రానున్నారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ఈ ఉదయం రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసింది. అయితే, విడుదల చేసిన 21 నిమిషాల్లోనే 2.25 లక్షల టికెట్లు పూర్తయ్యాయి. మొత్తం పది రోజుల పాటు ఈ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం : తిరుమలలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను ఈ రోజు నుంచి టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనూ ఇవి పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ 6.75 కోట్ల ఆదాయం సమకూరింది. పది రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదే విధంగా శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

దీపావళి ఆస్థానం : తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

బ్రేక్ దర్శనం రద్దు : ఈ నెల 12 వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేయడం అయినది. ముందు రోజైన 11 వ తేదీన బ్రేక్ దర్శనానికి సిఫారసు లెటర్లు స్వీకరించటం లేదని టీటీడీ వెల్లడించింది. నవంబర్ 12న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.












Click it and Unblock the Notifications