ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,165 నమూనాలను పరీక్షించగా.. 218 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,740కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనా బారినపడి ఎవరూ మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7186 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 117 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,83,759కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1795 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,46,42,664 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 13, చిత్తూరులో 63, తూర్పుగోదావరిలో 23, గుంటూరులో 24, కడపలో 21, కృష్ణాలో 21, కర్నూలులో 18, నెల్లూరులో 5, ప్రకాశంలో 2, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 13,
విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా మరోసారి.. మహారాష్ట్రలో భారీగా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతాయి. బుధవారం 35,871 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605కి చేరింది. కొత్తగా 17,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,10,63,025కి చేరింది. గత 24 గంటల్లో 188 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,59,216కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,52,364 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 3,71,43,255కి చేరింది.












Click it and Unblock the Notifications