ఏడాదిలో ఏకంగా ప్రజలసొమ్ము రూ.667కోట్లు దోపిడీ!
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. గత ఏడాది ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు రాష్ట్రంలో మొత్తం 41,755 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో సాధారణ ప్రజలు సుమారు 667 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. పోలీసు శాఖ రీసెర్చ్ లో ప్రధానంగా 10 రకాల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది.
పిషింగ్ మోసాలు
పిషింగ్ మోసాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇందులో నేరగాళ్లు బ్యాంకు అధికారులుగా నటించి SMS లేదా ఈమెయిల్ ద్వారా నకిలీ లింకులు పంపి, ఖాతా వివరాలు సేకరిస్తారు. జాబ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రతిపాదనలతో కూడా ప్రలోభపెడతారు. లింకుపై క్లిక్ చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి.

పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలు
రెండవ స్థానంలో ఉన్నవి పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలు. నకిలీ ట్రేడింగ్ యాపులు, వాట్సాప్-టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అధిక లాభాలు వస్తాయని, రోజువారీ ఆదాయం వస్తుందని ఆకర్షణీయ ప్రకటనలు చేసి ప్రజలను ఆకర్షిస్తారు. క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట మోసపూరిత సంస్థల్లో డబ్బు పెట్టుబడి పెట్టించి, తర్వాత మొత్తం దోచేసి మాయమవుతారు.
విషింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ లు
విషింగ్ మోసాల్లో నేరగాళ్లు ఫోన్ ద్వారా బ్యాంకు లేదా పోలీసు అధికారులుగా మారి భయపెడతారు. కేవైసీ అప్‌డేట్, ఆధార్ దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ వంటి కారణాలు చెప్పి OTPలు, పాస్‌వర్డ్‌లు అడుగుతారు. రిమోట్ యాక్సెస్ యాపులు ఇన్‌స్టాల్ చేయించి ఫోన్‌ను పూర్తిగా నియంత్రించి డబ్బు బదిలీ చేయిస్తారు.
క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు
క్రెడిట్ మరియు డెబిట్ కార్డు మోసాలు కూడా సాధారణం. కార్డు అప్‌గ్రేడ్ పేరిట కార్డు నంబర్, CVV, PIN వివరాలు సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తారు. నకిలీ పేమెంట్ లింకులు పంపి మోసం చేయడం కూడా జరుగుతోంది. ఆన్‌లైన్ రుణ మోసాల్లో మైక్రో లోన్ యాప్ లను ఉపయోగించి క్షణాల్లో రుణం ఇస్తామని ఆకర్షిస్తారు. ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట డబ్బు తీసుకుని, తర్వాత అధిక వడ్డీలు వేసి బెదిరింపులకు దిగుతారు.
వ్యక్తిగత సమాచారంతో బ్లాక్ మెయిల్స్
వ్యక్తిగత ఫోటోలను మార్ఫ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగ మోసాల్లో ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ ప్రకటనలు వేసి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంటర్వ్యూ ఛార్జీలు వసూలు చేస్తారు. విదేశీ ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చి సైబర్ నేరాలు చేయించడం కూడా సాధారణం. ఇతర ముఖ్యమైన మోసాల్లో డిజిటల్ అరెస్ట్, లవ్ స్కామ్స్, ఫేక్ కస్టమ్స్, టాక్స్ రీఫండ్ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటివి ఉన్నాయి.
సైబర్ నేరాల బారిన పడకుండా ఇలా చెయ్యాలి
అందుకే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే తెలియని లింకులు, SMS, ఈమెయిల్స్ క్లిక్ చేయకూడదు.OTP, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదు.అధిక లాభాలు హామీ ఇచ్చే యాపులు, గ్రూపులను నమ్మకూడదు. రుణాలు, ఉద్యోగాలు తీసుకునేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వాడాలి. అనుమానం వచ్చిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలి.












Click it and Unblock the Notifications