ఏపీలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు: 6వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు, జిల్లాల్లోనూ క్షీణత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, 500కి దిగువనే కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,712 నమూనాలను పరీక్షించగా.. 432 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 432 కరోనా కేసులు, 05 మంది మృతి
కొత్తగా నమోదైన 432 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,60,472కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఐదుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,307కి పెరిగింది.

ఏపీలో 6వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 586 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,40,131కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 6,034 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,89,85,846 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 6 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 10, చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 29, గుంటూరులో 61, కడపలో 08, కృష్ణాలో 60, కర్నూలులో 06, నెల్లూరులో 43, ప్రకాశంలో 41, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 06, పశ్చిమగోదావరిలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,92,897, చిత్తూరులో 2,45,762 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,870) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవి 229 రోజుల కనిష్టానికి చేరడం గమనార్హం. శనివారం 144 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,52,142కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గత సంవత్సరం మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి తగ్గింది. పాజిటివిటీ రేటు 0.57 శాతానికి తగ్గి 220 రోజుల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. శనివారం 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేయగా, ఇప్పటి వరకు ఏదో ఒక టీకా డోసు తీసుకున్నవారి సంఖ్య 97.65 కోట్లు దాటింది.