కర్నూలులో వైసీపీకి షాక్: టీడీపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు?
అమరావతి: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగలనుందా? జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు 'ఆపరేషన్ ఆకర్ష్' ను మొదలుపెట్టారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్ధానాలకు గాను కేవలం 3 సీట్లకే టీడీపీ పరిమితమైంది.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు అంగీకరించారని విశ్వసనీయ సమాచారం. వీరి చేరికతో కర్నూలు జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావచ్చనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేల చేరికపై ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌చార్జిలకు సంకేతాలు కూడా పంపించారని తెలుస్తోంది. బుధవారం చంద్రబాబు కర్నూలు జిల్లాలో ‘జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు అద్దం పడుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ పట్టం కట్టాలని అక్కడి ప్రజలను సూచించారు. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష సభ్యుల తీరుని సైతం అక్కడ ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఓ బహిరంగ సభలో తొలిసారి విపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డది ఇక్కడే.
కర్నూలు జిల్లా ప్రజలు ఎక్కువ శాతం వైసీపీ నేతలకు పట్టం కట్టారు. మీరు పట్టం కట్టిన నేతలు అసెంబ్లీలో ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో చూడండంటూ వారిపై తీవ్ర విమర్శలు చేశారు. విపక్ష సభ్యులు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సైతం పాల్పడతున్నారంటూ ఆరోపించారు.
విపక్ష నేతలు సభలో తనను కాల్ మనీ సీఎం, కామ సీఎం అంటూ తిట్టారని, అయినప్పటికీ తాము సంయమనం పాటించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాల్ మనీ విషయమై చర్చకు వచ్చినప్పుడు ఓ ముఖ్యమంత్రి పైన విపక్ష సభ్యులు దారుణంగా మాట్లాడటం మీరు ఎన్నుకున్న వైసీపీ నేతలకే చెల్లిందంటూ పరోక్షంగా సూచించారు.

అంతేకాదు రాబోయే ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడించాలనే సంకేతాలను పంపించారు. జన్మభూమి కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు రాత్రి పత్తికొండలోనే బస చేశారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో గంటన్నరపాటు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇన్‌చార్జిలు సర్దుకు పోవాలని సీఎం చెప్పినట్లు తెలిసింది. టీడీపీలోకి చేరే వారిలో ఆదోని డివిజన్‌కు చెందిన నలుగురు, కర్నూలు డివిజన్‌కు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications