ఏపీలో కరోనా కట్టడికి 60 కోవిడ్ కేర్ కేంద్రాలు , తాజాగా కరోనా కేసులు, మరణాలు ఎన్నంటే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో దారుణమైన పరిస్థితులు సృష్టిస్తుంది . ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ లు చేస్తూ కరోనా కట్టడి యత్నాల్లో ఉన్నాయి. ఇక ఏపీలోనూ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

గత 24 గంటల్లో 14,669 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ, కేసుల పెరుగుదలలో మాత్రం మార్పు లేదు. ఇక తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,669 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు గా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా మృతులు ఒక్క రోజులో 71 మంది
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,681 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 14వేల 669 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. మొత్తం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,62,15 ,831 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 10,69,544 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ఏపీలో వైద్య సదుపాయాల కొరత లేకుండా చూస్తున్నామన్న మంత్రి ఆళ్ళ నాని
ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సదుపాయాల కొరత లేకుండా చూస్తుందని, ఆస్పత్రులలో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు .మంత్రుల కమిటీలో కరోనా నియంత్రణ కార్యక్రమాలపై చర్చించామని తెలిపారు ఆళ్లనాని. ఏపీలో కరోనా మరణాలు తగ్గించేలా చికిత్స అందించటం కోసం కావలసిన ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు .రాష్ట్రంలో ఆక్సిజన్ లోటులేకుండా చూస్తున్నామన్నారు .

కోవిడ్ కేర్ కేంద్రాలలో 33వేల బెడ్ లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి
60 కోవిడ్ కేర్ కేంద్రాల్లో కూడా చికిత్స అందిస్తున్నామని, కోవిడ్ కేర్ కేంద్రాలలో 33వేల బెడ్ లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్ ల అక్రమ దందాను అరికట్టడం కోసం విజిలెన్స్ ను రంగంలోకి దింపామని తెలిపారు. కరోనాను కట్టడి చేయడం కోసం అన్ని చర్యలను చేపట్టామని ఆళ్ల నాని వివరించారు.మరోపక్క ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలం అయ్యిందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి .












Click it and Unblock the Notifications