ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 1650కి చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటి వరకు 524 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

అత్యధికంగా కర్నూలులోనే..
ప్రస్తుతం 1093 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, సోమవారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 491కి చేరింది. గుంటూరులో 19 కేసులు నమోదు కాగా, కరోనా బాధితుల సంఖ్య 338కి చేరింది.

వలస కూలీలు మాత్రమే రావాలి..
కాగా, పొరుగు రాష్ట్రాల్లోని వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఉందని, ఇతరులు ఇప్పుడే రావొద్దని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వలస కూలీలతోపాటు ఇతర ప్రజలు కూడా వస్తే పరీక్షలు నిర్వహించడం కష్టమవుతుందని తెలిపింది. అందుకే మిగితా వారు సహకరించాలని కోరింది.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతానికి ఎక్కడివారు అక్కడే వుంటేనే మంచిదని అభిప్రాయపడింది.

జిల్లాల వారీగా కేసులు
ఏపీలో అత్యధికంగా కర్నూలులో 491 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరులో 338, కృష్ణాలో 278 కేసులు, నెల్లూరులో 91 కేసులు, అనంతపురంలో 78, చిత్తూరులో 82, తూర్పుగోదావరిలో 45, కడపలో 87 కేసులు, ప్రకాశంలో 61, విశాఖపట్నంలో 35, పశ్చిమగోదావరిలో 59, శ్రీకాళంలో 5 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం గమనార్హం. మొత్తం 33 మరణాలు సంభవించాయి. ఏపీలో రెడ్ జోన్లలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో సడలింపులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మద్యం షాపులు కూడా ఓపెన్ చేయడంతో మందు బాబులు భారీ సంఖ్యలో షాపుల ముందు బారులు తీరారు. కాగా, ఏపీలో వైన్ షాపులు ఓపెన్ చేయడం పట్ల ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.