ఆ ఒక్క జిల్లా మినహా ఏపీలో కరోనా కల్లోలం: 9వేలకు చేరువలో కొత్త కేసులు, భారీగా మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 9వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,922 నమూనాలను పరీక్షించగా.. 8,987 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల వృథా: తమిళనాడు టాప్, ఆ జాబితాలో తెలంగాణ కూడా

ఏపీలో కొత్తగా 8987 కరోనా కేసులు, 35 మరణాలు
తాజాగా నమోదైన 8987 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 35 మంది మృతి చెందారు. అత్యధికంగా నెల్లూరులో జిల్లాలో 8 మంది మరణించగా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7472కు చేరింది.

ఏపీలో 50వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3116 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,15,626కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 53,889 యాక్టివ్ కేసులున్నాయి.

పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా విలయం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,53,679 కరోనా నమూనాలను పరీక్షించారు. సోమవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే 3వేలకుపైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1347, శ్రీకాకుళం1344 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి కరోనా సోకింది. ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లా మినహా 12 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కేసులు తక్కువగా నమోదవుతుండటం గమనార్హం.

ఏపీలో జిల్లాల వారీగా భారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 275, చిత్తూరులో 1063, తూర్పుగోదావరిలో 851, గుంటూరులో 1202, కడపలో 297, కృష్ణాలో 441, కర్నూలులో 758, నెల్లూరులో 1347, ప్రకాశంలో 305, శ్రీకాకుళంలో 1344, విశాఖపట్నంలో 675, విజయనగరంలో 330, పశ్చిమగోదావరిలో 99 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.



Click it and Unblock the Notifications
