ఏపీ, తెలంగాణపై వందేభారత్ రైళ్ల వర్షం కురిపించిన నరేంద్రమోడీ
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వందేభారత్ రైళ్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రారంభంలో ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినప్పటికీ ప్రయాణికులు క్రమంగా అలవాటుపడిపోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవాలనే ఉద్దేశంతో సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రారంభమవుతున్న వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా హాజరుకాలేకపోయినప్పటికీ వర్చువల్ గా అయినా ప్రారంభిస్తున్నారు. దీన్నిబట్టి ఆయన రైల్వేకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
సోమవారం రెండు రైళ్లు ప్రారంభం
తాజాగా ఆయన సోమవారం విశాఖపట్నం నుంచి చత్తీస్ గడ్ లోని దుర్గ్ వరకు ప్రయాణించే మరో వందేభారత్ ను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. చత్తీస్ గడ్ లో పారిశ్రామిక నగరంగా పేరుపొందిన దుర్గ్ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు ఎక్కువ దీన్ని దృష్టిలో ఉంచుకొని రాయగడ మీదుగా దీన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి దీంతో కలుపుకొని నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నట్లవుతుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రెండు, విశాఖ నుంచి భువనేశ్వర్ కు ఒకటి, విశాఖ నుంచి దుర్గ్ కు ఒకటి కలిపి నాలుగు రైళ్లు అయ్యాయి.

మరిన్ని కావాలంటూ డిమాండ్లు
సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించే వందేభారత్ రైళ్లలో విశాఖ-దుర్గ్ తోపాటు సికింద్రాబాద్-నాగపూర్ వందేభారత్ కూడా ఉంది. ఈ రైలుతో కలుపుకొని సికింద్రాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రెండు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు ఒకటి, కాచిగూడ నుంచి బెంగళూరుకు ఒకటి నడుస్తున్నాయి. ఇవి కాకుండా విజయవాడ నుంచి చెన్నైకి మరో వందేభారత్ రైలు నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ తర్వాత విశాఖ నుంచి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మరిన్ని రైళ్లు నడిపించాలంటూ ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తోంది.
ఏపీ, తెలంగాణలో నడుస్తున్న వందేభారత్ రైళ్లు
సికింద్రాబాద్-విశాఖపట్నం
సికింద్రాబాద్-విశాఖపట్నం
సికింద్రాబాద్-తిరుపతి
సికింద్రాబాద్-నాగపూర్
కాచిగూడ-బెంగళూరు
విజయవాడ-చెన్నై
విశాఖపట్నం-దుర్గ్
విశాఖపట్నం-భువనేశ్వర్
విజయవాడ-చెన్నై












Click it and Unblock the Notifications