కుల రాజకీయాలకు పునాది వేసిన ప్రాంతీయ పార్టీలు?
కుల రాజకీయాలనేవి ప్రాంతీయ పార్టీల ఏర్పాటుతో మొగ్గ తొడిగాయని చెప్పవచ్చు. జాతీయ పార్టీల్లో ఈ భావన ఉండదు. ప్రాంతీయ పార్టీలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆవిర్భవించినప్పటికీ వాటి మనుగడకు మాత్రం కులమే ఆలంబనగా నిలుస్తోంది. దశాబ్దాల క్రితమే తెలుగు రాజకీయాల్లో కులమనే మొక్క చిగురించింది. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలంటే కులం ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాంతోపాటు ఆర్థికబలం, అంగబలం సరేసరి.

రోజురోజుకు పెరుగుతున్న కుల జాడ్యం
ఏపీలో కుల రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కులం రంగు పులుముకుంటోంది. ఎవరికి వారికి వారి వారి కులాలపై అభిమానముండటాన్ని తప్పు పట్టలేం. కానీ అది శ్రుతిమించి దురభిమానంగా మారుతోంది. తద్వారా విద్వేషాగ్నులు రగులుతున్నాయి. దీంతో రాజకీయ యవనికపై అవాంఛనీయ పరిణామాలు తలెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి.
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజలందరికీ తనను ఒక కులానికి పరిమితం చేయవద్దని పదే పదే కోరుకుంటున్నారు. తాను ఏ ఒక్క కులానికో ప్రతినిధిని కానని, సమసమాజ స్థాపన కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రతి సమావేశంలో చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన్ను ఒక సామాజికవర్గానికే ప్రతినిధిగా చూడటమనేది ఎంతో సిగ్గుచేటని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల ఆలోచనా తీరులో మార్పురావాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జూలు విదిలిస్తోన్న కుల రక్కసి
ఏపీలో కుల రక్కసి జూలు విదిలిస్తోంది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే కుల ప్రస్తావన తెస్తుండటంతో ఒకరకంగా కులానికి రాజముద్ర పడిపోయింది. నేరానికి, కులానికి సంబంధం ఉండదు. సమాజంలో రెండే వర్గాలుంటాయి. ఒకరు దోపిడీ చేసేవారు కాగా.. మరొకరు దోపిడీకి గురయ్యేవారు. ఒకరు నేరస్తుడైతే మరొకరు బాధితుడు. ఒకరు బాధకు గురయ్యేవారు, మరొకరు బాధకు గురిచేసేవారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని కులానికి ఆపాదించడం ఎంతవరకు సబబో ప్రజలే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

విద్వేషాలు రెచ్చగొడుతున్న సోషల్ మీడియా
సోషల్ మీడియాలో అయితే పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రస్తుత సమాజం కులాలవారీగా చీలిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లు అభ్యంతరకరంగా ఉంటున్నాయంటూ పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ అవి తగ్గడంలేదు. సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి, విద్వేషాగ్నులు రెచ్చగొట్టడానికి ఈ పోస్టులు దోహదపడుతున్నాయి. విద్వేషాలు ప్రబలకుండా రాజకీయ నేతలు, పోలీసులే పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications