బస్సు ప్రమాదం: పెళ్లి రోజే తిరిగి రాని లోకాలకు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన సుందర్ రాజు, విజయ మేరి దంపతులు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరణించిన రోజే వారి పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తమ కూతురు చదువు నిమిత్తం ఆ దంపతులు గత నాలుగు సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల రీత్యా వైద్య పరీక్షల నిమిత్తం వారు మంగళవారం రాత్రి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దంపతులిద్దరూ ఈ ప్రమాదంలో దంపతులిద్దరు మృతిచెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

కాగా విజయమేరి తల్లిదండ్రులు కూడా 1989లో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే మరణించినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర వోల్వో బస్సులో మంటలు వ్యాపించడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు కల్వర్టును ఢీకొనడంతో ట్యాంకు నుంచి డీజిల్ లీకవడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు నుంచి బయటికి తీసిన మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. గుర్తుపట్టేందుకు వీలులేనంతగా మృతదేహాలు కాలిపోవడంతో వైద్యులు ఢిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయనాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.
తొలిసారి ట్రావెల్స్ బస్సు ఎక్కి...
తొలిసారి ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన కరీంనగర్ వాసి అమరేందర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన అమరేందర్ ఎప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అమరేందర్ మూడేళ్ళుగా బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడని వారు చెప్పారు.
పది నెలల క్రితం అమరేందర్‌కు వివాహమైందని, దసరా పండగకు గ్రామానికి వచ్చిన ఆయన తన భార్య నర్మద గర్భవతి కావడంతో ఆమెను ఇక్కడే వదిలి బెంగళూరుకు వెళ్లిపోయినట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తిరిగి గ్రామానికి వస్తున్న అమరేందర్ బుధవారం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. పాతబస్తీలో నివాసం ఉంటున్న అస్మదుల్లా, అతడి భార్య, కూతులు ప్రమాదంలో సజీవదహనమయ్యారు.












Click it and Unblock the Notifications