పొంచివున్న తుఫాన్ గండం: నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు కుండపోత: నార్త్ తమిళనాడు సహా
విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరదనీటితో తొణికిసలాడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కొద్దిసేపటి కిందటే వెల్లడించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
బంగాళాఖాతంలో సుమత్రా తీర ప్రాంతానికి సమీపంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఈ అల్పపీడనం.. పశ్చిమం-వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. నేరుగా ఈ అల్పపీడనం తమిళనాడు ఉత్తరం, ఏపీ దక్షిణ ప్రాంత కోస్తా జిల్లాలను సమీపిస్తుంది. ఈ క్రమంలో ఈ అల్పపీడనం తుఫాన్‌గా రూపాంతరం చెందడానికి అనుకూల వాతావరణం బంగాళాఖాతంలో నెలకొని ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఎల్లుండి ఏపీ, తమిళనాడు సమీపానికి..
మంగళవారం నాటికి ఈ అల్పపీడనం ఏపీ-తమిళనాడు తీర ప్రాంతాలకు సమీపించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు ఉత్తర కోస్తా, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అదే సమయంలో కేరళ, మాహెల్లో అతి భారీ వర్షాలు పడతాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని స్పష్టం చేశారు.
చేపల వేటకు వెళ్లొద్దంటూ..
బంగాళాఖాతంలో తాజా అల్పపీడనాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ కేంద్రం అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. నాలుగు నుంచి అయిదు రోజుల పాటు మత్స్యకారులెవరూ బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు. ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు ఉత్తర ప్రాంతం వైపు చేపలవేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. ఇప్పటికే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు 9వ తేదీ నాటికి ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే అరేబియా సముద్రంలో అల్పపీడనం..
ఇప్పటికే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అరేబియా సముద్రం తూర్పు మధ్య ప్రాంతంలో ఈ ఉదయం 8:30 గంటలకు ఈ అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలో ముంబైకి నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, గోవా రాజధాని పనాజీకి పశ్చిమ-నైరుతి దిశగా 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదంటూ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలను జారీ చేశారు.
Recommended Video
9వ తేదీ వరకు
అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీ సహా తమిళనాడు, దక్షిణ కర్ణాటక, యానాం, పుదుచ్చేరి, కరైకల్‌లల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై మరోసారి ప్రమాదపుటంచుల్లో నిలిచింది. వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఎల్లుండి వరకూ ఇదే తరహా భారీ వర్షాలు మరిన్ని కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైలో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలను సైతం ఆయన లెక్క చేయలేదు. మంగళూరు, చిక్‌మగళూరు, చామరాజ నగర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications