చిరుతపులితో పోరాడి.. ప్రాణాలు దక్కించుకున్నాడు
ప్రకాశం: తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ బక్కచిక్కిన రైతు మహా పోరాటమే చేశాడు. అది కూడా చిరుత పులితో. ఒక్కసారిగా తనపైకి దాడి చేసేందుకు ప్రయత్నించిన చిరుతతో.. తన వద్ద ఉన్న కొడవలితో చిన్నపాటి యుద్ధమే చేశాడు.
అతని పోరాటానికి బెదిరిన పులి పలాయనం చిత్తగించక తప్పలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం జిల్లెలమూడిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నరసింహారావు పులితో పోరాడి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

నరసింహారావు తన పొలంలో పని చేసుకుంటుండగా.. అకస్మాత్తుగా ఆయనపై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించింది. చిరుత దాడితో వెంటనే తేరుకున్న నరసింహారావు తన చేతిలో ఉన్న కొడవలినే తన ప్రాణాలు కాపడే ఆయుధంగా ఉపయోగించుకున్నాడు.
చిరుతతో చేతిలో వున్న కొడవలి సాయంతో కాసేపు పోరాడాడు. రైతు పోరాటానికి బెంబేలెత్తిన పులి.. పలాయనం చిత్తగించింది. అయితే చిరుత దాడిలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications