కర్ణాటక కేబినెట్ విస్తరణ- మారుతున్న ఈక్వేషన్స్: ఢిల్లీకి డీకే శివకుమార్, సిద్ధరామయ్య
కర్ణాటకలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన తుదిజాబితా సిద్ధమైంది. ఈ జాబితాతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నెల 18న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, హైకమాండ్ తో విడివిడిగా సమావేశం కానున్నారు. శాఖల మార్పులు, కేటాయింపులు, సామాజిక వర్గాలవారీగా నూతన మంత్రుల చేరిక.. వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి పలువురు ఎమ్మెల్యేలు, వివిధ వర్గాల ప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ వస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగబోయే చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆశావహుల పేర్లు ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఈ పరిణామాలపై అటవీ శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి స్పందించారు. విస్తీర్ణం పరంగా బెళగావి జిల్లా పెద్దది కావడం వల్ల కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన పట్టుబట్టారు.

కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ సైతం ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనే విషయంపై జార్కిహోళి మాట్లాడారు. ఎవరికి చోటు కల్పించాలనేది పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలను పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తగిన సమయంలో తీసుకుంటారని, వారిపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.
తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్ ఇటీవలే బళ్లారిలో భారీ సమావేశం నిర్వహించారు. తన మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ సైతం తీశారు. శివమొగ్గ, బెళగావి, ధార్వాడ వంటి జిల్లాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వచ్చాయి. ధార్వాడ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బయ్య ప్రసాద్ కూడా ఇటీవలే డీకే శివకుమార్ ను కలిశారు. మంత్రివర్గంలో తీసుకోవాలని కోరారు. శాసనమండలి నుంచి సలీం అహ్మద్ మంత్రిపదవిని ఆశిస్తోన్నారు.
సిద్దరామయ్య రాజీనామా అనంతరం ఏర్పడిన డీకే శివకుమార్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వరతో సహా ప్రస్తుతం 14 మంది మంత్రులు ఉన్నారు. అదనంగా మరో 10 మంది వరకు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. యువ రక్తం, అనుభవజ్ఞులను సమన్వయం చేసేలా పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేయొచ్చు.













Click it and Unblock the Notifications