విషాదం: క్లాస్‌మేట్ తనను పట్టించుకోవడం లేదని యువతి ఆత్మహత్య
చిత్తూరు: జిల్లాలోని కలకడ మండల కేంద్రంలోవిషాద ఘటన చోటు చేసుకుంది. తనతో స్నేహితులు మాట్లాడటం లేదని మనస్థాపం చెందిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మకాలనీకి చెందిన అంజనా దేవి కలకడ మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె కుమార్తె రంజిత(18) విజయవాడలోని చైతన్య కళాశాలలోని భవిష్య క్యాంపస్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటోంది.

కాగా, లాక్‌డౌన్ కారణంగా క్యాంపస్ మూసివేయడంతో కొద్ది రోజుల క్రితం రంజిత ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే రంజిత తన క్లాస్‌మేట్ అయిన ఓ విద్యార్థితో రోజూ ఫోన్లో మాట్లాడేది. అయితే, మూడు రోజులుగా అతడు ఫోన్ చేయడం లేదు. అంతేగాక, ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా రంజిత్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో రంజిత తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
పోలీసులకు సమాచారం అందించడం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారం కోణం ఏమైనా ఉందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.