బలవంతపు పెళ్లి: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: చదువుకుంటానని, తనకు ఇప్పుడే పెళ్లి వద్దని ఎంత చెప్పినా.. తల్లిదండ్రులు వినకపోవడంతో ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన పీరయ్య, భగవతి దంపతులు మూడేళ్ల క్రితం నగరంలోని హుమాయున్‌నగర్ ఎస్‌బీ కాలనీకి వచ్చి స్థిరపడ్డారు.
పీరయ్య వాచ్‌మెన్‌గా అతని భార్య భగవతి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సుజాత, జయశ్రీ. కొంత కాలం క్రితం సుజాతకు వివాహం చేశారు. కాగా, చిన్నకూతురు జయశ్రీ(15) హుమాయున్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెకు శనివారం పెళ్లి చూపులు నిర్వహించారు.

వివాహం ఇష్టం లేని జయశ్రీ ఇంటర్ తర్వాత చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయమై శనివారం రాత్రి తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవ జరిగింది.మనస్తాపానికి గురైన జయశ్రీ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
తీవ్ర కాలిన గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరికీ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications