నిర్లక్ష్యం: ధ్వంసమైన ఆంజనేయస్వామి ఆలయం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూలిపోయింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా కృష్ణా కాల్వ నీరు విడుదల చేయడంతో ఆంజనేయస్వామి విగ్రహంతో సహా ఆలయం ధ్వంసమైంది.
20రోజులుగా డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే దేవాలయం ధ్వంసమైందని స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఒక్కసారిగా భారీగా విడుదల కావడంతో ఆంజనేయస్వామి ఆలయం ధ్వంసమైందని తెలిపారు.

మంగళవారం కావడంతో తెల్లవారుజామునే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. వారు వచ్చేసరికే ఆలయం పూర్తిగా ధ్వంసమై ఉండటంతో ఆందోళన చేపట్టారు. ఆలయ ధ్వంసం కావడానికి అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. దేవాలయాన్ని పునర్నించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.
ఊరికి ఎలాంటి అరిష్టం కలగకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు భక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. చందాలు వేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించామని స్థానికులు చెప్పారు. నీటిలో కొట్టుకుపోయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకున్న సమయంలో ఇలా జరగడం విచారకరమని స్థానిక భక్తులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications