దారుణం: ఇంట్లో మూత్రం పోశాడని చిన్నారి హత్య
కర్నూలు: అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు తమ ఇంట్లో మూత్రం పోశాడనే నెపంతో దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం పెద్ద హోతూరులో జరిగింది. తమ ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడనే కోపంతో ఇంటి యజమాని చిన్నతిప్పన్న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
బాలుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. చిన్నతిప్పన్న, చిన్నారి తండ్రి గంగాధర్ కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. అయితే వీరి కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి.

కాగా, గంగాధర్ కుమారుడు వినోద్(4).. చిన్నతిప్పన్న ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశారు. ఈ విషయాన్ని గమనించిన చిన్నతిప్పన్న ఆగ్రహంతో వినోద్ చెంపమీద బలంగా కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే పడిపోయాడు. గమనించిన వినోద్ కుటుంబసభ్యులు అతడ్ని హుటాహుటాని ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే వినోద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు వినోద్ మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చిన్నతిప్పన్న పరారీలో ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications