తెల్లారితే పెళ్లి: వరుడ్ని చంపేసిన మొదటి భార్య బంధువులు
గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. విడాకులు తీసుకుని, రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై మొదటి భార్య బంధువులు, మరికొందరు కలిసి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. అతడిని, అతడి మేనత్తను దారుణంగా పొడిచి చంపేశారు.
బాధితుల కథనం ప్రకారం.. దాచేపల్లికి చెందిన రావుల కోటేశ్వరరావు(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితమే మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు మరో వివాహనానికి సిద్ధమయ్యాడు. ఆయనకు శనివారం గుంటూరులో వివాహం జరగాల్సి ఉంది. ఈ ఏర్పాట్లలో వాళ్లంతా హడావుడిగా ఉండగా.. మొదటి భార్యకు సంబంధించిన కొందరు బంధువులు వచ్చి కోటేశ్వరరావు కుటుంబసభ్యులపై కత్తులతో దాడికి దిగారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు, అతని మేనత్త మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కోటేశ్వరరావు తండ్రి చంద్రయ్య, తల్లి వీరనాగమ్మ, సోదరుడు లింగరాజు, మరో మేనత్త వెంకటకోటమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. తెల్లారితే వివాహం జరగాల్సిన ఆ గృహంలో వరుడు, అతని మేనత్త మృతి చెందడంతో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications