అక్కను చంపిన తమ్ముడు: దంపతుల సజీవ దహనం
కృష్ణా/విశాఖపట్నం: కృష్ణా జిల్లా కంకిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంకిపాడులోని ట్రాన్స్ కార్యాలయంలో ఎదుట గురువారం ఉదయం ఓ ఇంట్లో అక్కపై తమ్ముడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె మరణించింది.
స్థానికుల కథనం ప్రకారం.. శివపార్వతి(37)కి తమ్ముడు నాగేశ్వరరావుతో కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య గురువారం ఉదయం జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. నాగేశ్వరరావు రోకలిబండతో అక్క తలపై మోదాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దంపతుల సజీవదహనం

విశాఖపట్నం: జిల్లాలోని మారికవలసలో దారుణం జరిగింది. మారికవలస జెఎన్ఎన్‌యూఆర్ఎమ్‌లోని 150 ఇంట్లో దంపతులు సజీవదహనమైన ఘటన గురువారం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ దంపతులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండలం చిత్రావతి దగ్గర గురువారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వస్త్ర దుకాణంలో మంటలు: భారీగా ఆస్తినష్టం
చిత్తూరు: శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. అప్పటికే దుకాణంలోని రూ. లక్షల విలువైన వస్త్రాలు అగ్నికి అహూతయ్యాయి.












Click it and Unblock the Notifications