ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ .... బూతులే కాదు తలలు నరుకుడు కూడా .. పోటాపోటీగా హింసా వ్యాఖ్యలు
ఏపీలో రాజకీయం రోజుకో రకంగా మలుపులు తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు అసభ్య పదజాలంతో తిట్టుకున్న నేతలు చేసిన రచ్చ మరిచిపోకముందే, ఇప్పుడు కొత్తగా తలలు నరుకుతామంటూ హింస రాజకీయాలు ఏపీలో తెరమీదకు వచ్చాయి. ఒకరి మీద ఒక తలలు నరుకుతామని చేసుకుంటున్న వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

నిన్నటి దాకా బూతులు.. ఇప్పుడు హింసా వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని, ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా అనంతపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ నేత చేసిన హింసా వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఇక ఆ తర్వాత అదే తరహా హింస వ్యాఖ్యలతో జనసేన పార్టీ మీద, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఎదురు దాడిగా హింసా వ్యాఖ్యలు మొదలయ్యాయి.

వైసీపీ నేతల తలలు నరుకుతా అన్న జనసేన కార్యకర్త
అసలు విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాప్తాడు నాయకుడు సాకే పవన్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఇప్పుడే రంగంలోకి దిగుతానని, వైసిపి నేతలను నరుకుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సాకే పవన్ కుమార్. వైసిపి బనాయించే తప్పుడు కేసులకు తమ కార్యకర్తలను భయపడే ప్రసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.

ఏ రెడ్డి అయినా సరే అంటూ వ్యాఖ్యలు .. సమర్ధించిన పవన్
అనంతపురం జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాత్రమే కాదు, ఏ రెడ్డి అయినా సరే, వారి తలలు నరికేందుకు నేను రెడీ మీరు రెడీనా అంటూ కార్యకర్తలను ప్రశ్నించాడు. ఆవేశంతో ఊగిపోయాడు . దీంతో సభా వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఎంతగా విసిగి వేసారి పోయారో , అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు. ఇక పవన్ వ్యాఖ్యల పై కేసు పెడితే, తన పైన కేసులు పెట్టాలని, గతంలో చంద్రబాబును ఉరితీయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేసులు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్త చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.

ఏ రెడ్డికి హాని జరిగినా పవన్ తల తీస్తాం అంటూ రివర్స్ ఎటాక్
జనసేన నాయకుడు సాకే పనవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారం రేపాయి. హింసా రాజకీయాలను జనసేన ప్రోత్సహిస్తోందని ఇప్పటికేవైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు కూడా స్పందించారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఎలాంటి హాని జరిగినా సహించమని, పవన్ కళ్యాణ్ తల తీసేందుకు కూడా వెనుకాడమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రెడ్డికి హాని జరిగినా పవన్ కళ్యాణ్ ఎముకలు విరిచేస్తామంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాక్షన్ వ్యాఖ్యలతో ఇప్పుడో రచ్చ ..
మొత్తానికి నిన్నటివరకు ఏపీ నేతల బూతు భాగోతాలు, తాజాగా ఫ్యాక్షనిస్టుల్లా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో రాజకీయాలు ఎలాంటి పరిస్థితికి దిగజారాయో చెప్పకనే చెబుతున్నాయి. ఇక తాజాగా జనసేన కార్యకర్త చేసిన తల నరుకుడు వ్యాఖ్యలపై అటు వైసిపి, రెడ్డి సామాజిక వర్గం భగ్గుమంటున్న వేళ మరెన్ని ఫ్యాక్షన్ వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఏపీలో రాజకీయ పార్టీల నేతలు మోతాదును మించి మాట్లాడుతుండటం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తోంది.












Click it and Unblock the Notifications