ప్రేమించమని ఉపాధ్యాయుడి వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: తనను ప్రేమించాలని ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలం పాతపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి. బనగానపల్లి గ్రామానికి చెందిన ఉషారాణి(13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా, గతేడాది నుంచి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అబ్దుల్(25) తనను ప్రేమించమని వేధింపులకు దిగడంతో విద్యార్థిని విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.
స్పందించిన యాజమాన్యం అబ్దుల్‌ను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు మీద కాపు కాసి వేధింపులకు గురి చేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాలిక అక్టోబర్ 11న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి ఆటో బోల్తా : 20 మందికి గాయాలు
పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా భోగాపురం మండలం అగ్నివరం గ్రామ సమీపంలోని 43వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం టి. నగరపాలెంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం వివాహం విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలానికి చెందిన స్వాతితో జరుగనుండటంతో పెళ్లి బృందం ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో అగ్నివరం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.












Click it and Unblock the Notifications