నిజాయితీ గల టీడీపీ కార్యకర్తలు కావాలి..- ఇప్పుడీ మాటలు ఎవరిని ఉద్దేశించి?
Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.
ప్రత్యేకించి- ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెర తీసింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలేనని తేల్చి చెప్పడం, తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మేనంటూ చురకలు అంటించడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించే నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యమే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదలుకున్నారు. తొలి జాబితాలోనే ఆయనను శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు సైతం అప్పట్లో హామీ ఇచ్చారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు చోటు దక్కలేదు. ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించుకున్నారనే అభిప్రాయం ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ వేదికగా పరోక్షంగా వర్మను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన ఆవిర్భావ సభ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అయింది. అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు తెలుగుదేశం పార్టీ మ్యూచువల్ అభిమానులు.. దీన్ని సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లోకి తీసుకొచ్చారు. విపరీతంగా రీట్వీట్లు, షేర్లు కొడుతోన్నారు.
మనకు కావాల్సింది కల్తీ నాయకులు కాదు. నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావాలి. పార్టీకి కష్టం వస్తే కాపాడుకునే యోధులు కావాలి.. అంటూ ఎన్టీఆర్ ఈ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. జనసేన సభ తరువాత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చెప్పారనేది తెలియట్లేదు గానీ- టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం తెగ వైరల్ చేస్తోన్నారీ వీడియోను.












Click it and Unblock the Notifications