మద్యం మత్తులో భర్తను హత్య చేసిన భార్య, మరదలు

కూలీ పని చేసే నాగరాజు తరచూ మద్యం తాగి వచ్చి భార్య మహేశ్వరితో గొడవపడి వేధింపులకు పాల్పడేవాడు. గురువారం మహేశ్వరి ఇంటికి ఆమె అక్క విజయలక్ష్మి, చెల్లి గీత వచ్చారు. మద్యం తాగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన నాగరాజు.. మహేశ్వరితో గొడవపడి ఆమెను కొట్టాడు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న మహేశ్వరి, విజయలక్ష్మ, గీతలు రోకలిబండతో నాగరాజుపై దాడి చేశారు. తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని చీరలో చుట్టి ఓ గదిలో పెట్టింది మహేశ్వరి. ఆ తర్వాత శుక్రవారం ఉదయం అందరూ కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లారు. సాయంత్రం 4గంటలకు తిరిగి ఇంటికి వచ్చి.. నాగరాజు మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఎక్కడైనా పడేయాలని పథకం వేశారు.
ఆటోను తీసుకొచ్చి అందులో మృతదేహాన్ని పెడుతుండగా అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ వారిని నిలదీశాడు. అంతేగాక పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చేలోపే నిందితులందరూ పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications