తల్లికి బంతి తగిలిందని ఘర్షణ: కత్తితో పొడిచి యువకుడ్ని చంపేశాడు

Subscribe to Oneindia Telugu

అమరావతి: చిన్న గొడవతో మొదలైన ఓ వివాదం చివరకు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని టెలికం కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఇంజినీరింగ్‌ చదివిన కిరణ్‌కుమార్‌(23) పిల్లలతో కలసి క్రికెట్‌ ఆడుతుండగా బంతి కాలనీలోని దేవకీదేవి అనే మహిళకు తగిలింది. ఆమెకు క్షమాపణ కూడా చెప్పారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తల్లికి బంతి తగిలిన విషయం తెలిసిన దేవకీదేవి కుమారుడు పొలిమెట్ల శ్రీకాంత్‌ అక్కడకు వచ్చి కిరణ్‌తో ఘర్షణ పడ్డాడని తెలిపారు. ఇద్దరి మధ్య వాదన పెరగటంతో ఆగ్రహంతో ఉన్న శ్రీకాంత్‌.. ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి కిరణ్‌కుమార్‌ ఛాతిలో పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

A young man from Vijayawada was stabbed to death following a fight over cricket

కిరణ్‌కుమార్‌ కుప్పకూలిపోగా అతడిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కిరణ్‌కుమార్‌, శ్రీకాంత్‌ల మధ్య పాత ఘర్షణల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని బంధువులు చెబుతున్నారు.

కాగా, శ్రీకాంత్‌ ద్విచక్రవాహనాన్ని కాలనీలో మితిమీరిన వేగంతో నడుపుతుంటాడని కాలనీవాసులు చెబుతున్నారు. గతంలో ఒకసారి బండి తగలటంతో కిరణ్‌కుమార్‌‌, శ్రీకాంత్‌ గొడవపడినట్లు చెప్పారు. అంతేగాక, శ్రీకాంత్.. పిల్లలను క్రికెట్ కూడా ఆడుకోనివ్వడని తెలిపారు.

మంగళవారం సాయంత్రం తన తల్లికి క్రికెట్‌బాల్‌ తగలటంతో పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుని కిరణ్‌కుమార్‌తో గొడవ పడి కత్తితో పొడిచి చంపాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కాగా, కిరణ్ అతడి తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు. అతడ్ని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలని చూస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం వారి కుటుంబంలో పెను విషాదం నింపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fight over a game of cricket on a street in Andhra Pradesh, led to the murder of a youngster in Vijayawada.
Please Wait while comments are loading...