చంద్రబాబును కస్టడీకీ ఇవ్వండి - ఏసీబీ కోర్టులో ఏం జరిగింది..!!
చంద్రబాబు కస్టడీ పిటీషన్ పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రను మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీఐడీ కస్టడీ పిటీషన్ దాఖలు చేసింది. అయిదు రోజులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీని పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసారు. వాదనల తరువాత న్యాయస్థానం రేపు ఉదయం 11.30 గంటలకు కస్టడీ పిటీషన్ పైన తీర్పు ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
కస్టడీకి ఇవ్వాలంటూ : స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గత వారమే ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అదే సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు రిమాండ్ రిపోర్టు సస్పెండ్ చేయాలని కోరుతూ స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసారు.

దీని పైన మంగళవారం సుదీర్ఘ వాదనల తరువాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసారు. హైకోర్టులో విచారణ వేళ ఇచ్చిన సూచనల కారణంగా రిమాండ్ పిటీషన్ పైన ఏసీబీ కోర్టు విచారణ చేయలేదు. ఈ రోజు విచారణ చేపట్టింది. దీంతో, మరోసారి సీఐడీ చంద్రబాబును ఈ స్కాంలో విచారణకు వీలుగా అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.
అయిదు గంటల వాదనలు : విచారణలో అసలు విషయాలు బయట పడతామనే కస్టడీకి అభ్యంతరం చెబుతన్నారని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధకార రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదని కోర్టుకు వివరించారు. రూ 371 కోట్ల దుర్వినియోగం పైన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసామని చెప్పారు.
మరింత విచారణ ద్వారా కుట్ర కోణం వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వాదించారు. స్కిల్ కేసులో నిధులు ఎక్కడకు ఎక్కడకు వెళ్లాయో తెలిసిందని.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

రేపు కోర్టు తీర్పు : సీఐడీ వాదనలపై చంద్రబాబు న్యాయవాది సిద్దార్ధ లూధ్రా అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు ఈ కేసులో చంద్రబాబ ప్రమేయం లేదని వాదించారు. నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేసారని కోర్టు ముందు మరోసారి వివరించారు. చంద్రబాబు ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు తో సంబంధం లేని కేసులో కస్టడీ కోరటం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు కు ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఈ నెల 22తో ముగియనుంది. ఈ సమయంలో సీఐడీ చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఈ పిటీషన్ పైన గురువారం ఏసీబీ కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుందనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications