గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు- ఊహించని ఎంపిక, ఏరి కోరి ఆ మహిళకు..!!
ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఖరారయ్యారు. కొద్ది రోజులు ఈ రెండు స్థానాల పైన కూటమిలో కసరత్తు కొనసాగింది. పలు పేర్లు తెర మీదకు వచ్చాయి. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ ల పదవీ విరమణ తో వారి స్థానంలో టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు చేసారు. చాలా కాలంగా చట్ట సభల్లో అడుగు పెట్టేందుకు వర్ల రామయ్య నిరీక్షణ ఫలించింది. అదే సమయంలో
ఒక సాధారణ మహిళకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వైసీపీ నుంచి పండుల రవీంద్ర బాబు, జకియా ఖానం గత నెల పదవీ విరమణ చేసారు. దీంతో.. కూటమి నుంచి ఈ రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్క లేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవుల పైన హామీ ఇచ్చారు. దీంతో.. గవర్నర్ కోటా లో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని భావించారు. అయితే.. ఈ రెండు స్థానాలకు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. పలు మార్లు రాజ్యసభకు చివరి వరకు రేసులో నిలిచినా.. చివరకు స్థానం దక్కని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ లో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.

ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం
ఈ మధ్య కాలంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ సమయంలోనూ వర్ల రామయ్య పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్క లేదు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. క్రిష్ణా జిల్లాకు చెందిన ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య పేరు ఖరారు చేయటంతో పాటుగా రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించారు. అనంతపురం లోక్ సభ నియోజకవర్గ అంగన్ వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో.. ఎస్సీ, బీసీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించేలా ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వర్ల రామయ్య టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. వర్ల రామయ్యతో పాటుగా సాధారణ మహిళకు ఈ సారి అవకాశం దక్కింది. ఈ రెండు పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.













Click it and Unblock the Notifications