కిమ్‌కు దండం పెట్టేసిన ట్రంప్. అమెరికా సైనిక విన్యాసాలకు బ్రేక్..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఉన్న 'ప్రత్యేక స్నేహం' కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన అడుగు వేశారు. దక్షిణ కొరియాతో కలసి అమెరికా నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా కుదించాలని తన యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌ను ఆదేశించారు. ఆగస్టు 17 నుంచి 27 వరకు పది రోజుల పాటు 'ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్' పేరిట ఈ డ్రోన్, సైబర్, జీపీఎస్ విరుద్ధ విన్యాసాలు జరగాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ విన్యాసాలను రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి, వాటి పరిమాణాన్ని, విస్తృతిని గణనీయంగా తగ్గించాలని స్పష్టం చేశారు.

'అది దండగ మారీ ఖర్చు.. కిమ్‌కు కోపం తెప్పించడమే!'
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాతో కలసి భారీ సైనిక విన్యాసాలు నిర్వహించడానికి గతంలో అమెరికా అంగీకరించడం తనకు ఏమాత్రం నచ్చలేదని పేర్కొన్నారు. ఈ డ్రిల్స్ వల్ల కోట్ల కొద్దీ డాలర్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోందని మండిపడ్డారు. అంతేకాకుండా, అనవసరంగా ఉత్తర కొరియాకు శత్రుత్వ సంకేతాలు పంపడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. తన పాలనా కాలంలో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో మర్యాదగా, ఎలాంటి బెదిరింపులు లేకుండా నడుచుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇరాన్ అణు రగడ.. దక్షిణ కొరియా 'నో'!
ఇదిలా ఉంటే, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మైంగ్‌తో ఇటీవల జరిగిన సంభాషణను కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరాన్ అణు నిరోధక చర్యల్లో (డీన్యూక్లియరైజేషన్) అమెరికాతో చేతులు కలపాల్సిందిగా దక్షిణ కొరియాను కోరానని, అయితే వారు అందుకు నిరాకరించారని ట్రంప్ తెలిపారు. మరోవైపు, ఈ విన్యాసాల వల్ల కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతాయని, ఇది పక్కా రెచ్చగొట్టే చర్యేనని ఉత్తర కొరియా ఇప్పటికే విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో కిమ్‌కు సంతోషం కలిగించేలా, దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచేలా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications