ఉద్యోగుల నిరీక్షణకు తెర- డీఏల విడుదల, పీఆర్సీ ముహూర్తం: సీపీఎస్ పై కీలక నిర్ణయం..!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర పడనుంది. సుదీర్ఘ కాలంగా తమ డిమాండ్ల పైన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ డిమాండ్లు వివరించాయి. సీఎం రేవంత్ తోనూ సమావేశం అయ్యారు. కాగా.. ఈ రోజు సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఈ సమయంలో డీఏల ప్రకటనతో పాటుగా పీఆర్సీ అమలు.. సీపీఎస్ పైనా నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. వీటి పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యోగులకు ఈ రోజు గుడ్ న్యూస్ రానుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల్లో (డీఏ) ప్రాథమికంగా రెండింటిని వెంటనే విడుదల చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. మిగిలిన డీఏలను ప్రతిపాదిత పీఆర్సీలో కలిపి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే పీఆర్సీ కమిషన్ నివేదికను తెప్పించి, రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లోనే వేతన సవరణను అమలు చేసేందుకు ప్రాధమికంగా నిర్ణయించారని సమాచారం. ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల పాత బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత పది నెలలుగా నెలకు రూ.1,000 కోట్ల చొప్పున విడుదల చేస్తున్న నిధులను రూ.2,000 కోట్లకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీని ద్వారా ఉద్యోగులకు రూ.1,000 కోట్లు, పెన్షనర్లకు రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరుతున్నాయి. సంక్షేమ పథకాల వ్యయాన్ని సైతం సర్దుబాటు చేస్తూ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఈ నెలవారీ నిధుల కేటాయింపును మరికొంత పెంచే విధంగా ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది.

నేడు సీఎం రేవంత్ తో సమావేశం వేళ
కాగా.. ప్రధానమైన డిమాండ్ గా ఉన్న పీఆర్సీ నివేదిక కోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, కమిషన్‌కు లేఖ రాశారు. ఉద్యోగులు 51 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ఎంత శాతం ప్రకటిస్తుందనే ఆసక్తిగా మారింది. ఇక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించేందుక మూడు నెలల కాలల పరిమితితో ప్రభుత్వం ఇదివరకే ఒక కమిటీని వేసింది. నిర్ణీత గడువులోగా నివేదిక తెప్పించుకుని ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నాం 2 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. పీఆర్సీ అమలు, డీఏల విడుదల, సీపీఎస్ రద్దుపై ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
