నేడే.. తిరుమలలో ముగింపు ఘట్టం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు చివరి రోజు. ఇందులో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేలాదిమంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరిస్తారివ్వాళ. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందస్తు చర్యలు తీసుకుంది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశార. భక్తులు పుష్కరిణిలోకి సులభంగా ప్రవేశించి, తిరిగి బయటకు వెళ్లేలా నిర్దేశిత ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

ఈ తెల్లవారు జామున 6 గంటలకు చక్రస్నానోత్సవం ఆరంభమైంది. ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు, చక్రత్తాళ్వార్‌కు వైదికోక్తంగా స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు అర్చకులు. చక్రస్నానం రోజంతా పవిత్ర ఘడియలుగా భావిస్తారు. అందుకే భక్తులు తమకు అనుకూల సమయంలో పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని వెంకయ్య చౌదరి తెలిపారు.
భక్తులు నిర్దేశించిన గేట్ల ద్వారానే ప్రవేశించి, సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమతించాలని అధికారులను ఆయన ఆదేశించారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలను అందుబాటులో ఉంచారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులు చక్రస్నాన మహోత్సవాన్ని సులభంగా వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు వైభవోత్సవ మండపంలో చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.














Click it and Unblock the Notifications
