మూడు నెలల పాటు యువతిపై రేప్: దోషికి పదేళ్ల జైలు శిక్ష
గుంటూరు: ఓ అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష పడింది. వికలాంగురాలిపై అత్యాచారం జరిపినట్లు నేరం రుజువు కావడంతో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం శిరిపురం గ్రామానికి చెందిన కారుమంచి ఓబులేసు అలియాస్ ఓబులు అనే వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష , రూ. 3 వేలు జరిమానా పడింది.
ఈ మేరకు నాలుగో అదనపు అసిస్టెంట్ న్యాయమూర్తి పి. కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఓబులేసు(45) నివసించే ప్రాంతంలో 18 ఏళ్ల వయసున్న వికలాంగురాలు తల్లి సంరక్షణలో ఉంటోంది. ఆమెకు తండ్రి లేకపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్లి కూతురిని పోషిస్తోంది. అంగవైకల్యంతో పాటు మానసికంగా ఎదుగుదల లేకపోవడంతో ఆమెకు మాటలు కూడా సరిగా రాని పరిస్థితి.
ఆమె నిస్సహాయతను గమనించిన ఓబులేసు తల్లి కూలి పనులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉంటున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉంటున్న వికలాంగురాలిపై మూడు నెలల పాటు అత్యాచారం కొనసాగించాడు. ఓబులేసు ప్రవర్తనపై అనుమానం కలిగిన చుట్టు పక్కల వారు మిరియాల రవిబాబు అనే పెద్ద మనిషి ద్వారా హెచ్చరించారు. దాంతో ఓబులేసు కొన్నాళ్లు మిన్నకున్నాడు.

2011 మార్చి 31న మధ్యాహ్నం తిరిగి వికలాంగురాలిపై అత్యాచారం జరుపుతుండగా చుట్టుపక్కల వారు వచ్చి కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ సంఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ జె. పూర్ణచంద్రరావు కేసు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
ఏపీపీ వైఎస్ పుష్ప ప్రాసిక్యూషన్ నిర్వహించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు ఓబులేసుకు పదేళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.












Click it and Unblock the Notifications